పెద్ద పులి సాధువు.. చిన్న పులి ఉగ్రనరసింహం: గోరంట్ల బుచ్చయ్య చౌదరి

  • ఎన్టీఆర్ అందరికీ ఆరాధ్యదైవమన్న బుచ్చయ్య చౌదరి
  • ఎన్టీఆర్ పై వైఎస్సార్ అవినీతి ఆరోపణలు చేసి పారిపోయారని ఎద్దేవా
  • లోకేశ్ దెబ్బకు గొడ్డలి పార్టీ పారిపోయిందన్న బుచ్చయ్య చౌదరి
తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న మహానాడు రెండో రోజు కొనసాగుతోంది. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేత, పొలిట్ బ్యూరో సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రసంగిస్తూ... దివంగత ఎన్టీఆర్ కు సంబంధించిన పలు విషయాలను పంచుకున్నారు. ఎన్టీఆర్ అందరికీ ఆరాధ్య దైవమని ఆయన అన్నారు. పార్టీ గురించి 1982 మార్చి 28న ఆదర్శ్ నగర్ లో ఎన్టీఆర్ ప్రకటన చేశారని చెప్పారు. అప్పుడు ఎన్టీఆర్ వద్దకు పెద్ద పెద్ద వాళ్లు ఎవరూ రాలేదని... కేవలం సామాన్యులు మాత్రమే అండగా నిలిచారని గుర్తు చేసుకున్నారు. ఎండలు, తుపానులను లెక్క చేయకుండా 7 నెలల పాటు యాత్ర చేశారని... తొమ్మిది నెలల్లో అధికారంలోకి వచ్చి చరిత్ర సృష్టించారని చెప్పారు. 

అప్పట్లో ఎన్టీఆర్ ఏ సినిమా తీసినా 300 రోజులు ఆడేదని బుచ్చయ్య చౌదరి తెలిపారు. అలాంటి రోజుల్లోనే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని... ఎన్నో సమస్యలు ఉన్నా నీతివంతమైన పాలన సాగించారని కితాబునిచ్చారు. శ్రీశైలం ప్రాజెక్టును తాగు, సాగునీరు ఇచ్చే విధంగా తెలుగుగంగకు శ్రీకారం చుట్టారని తెలిపారు. అయితే, మిగులు జలాల పేరుతో తెలుగుగంగను అడ్డుకునేందుకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఎన్టీఆర్ పై రాజశేఖర్ రెడ్డి అవినీతి ఆరోపణలు చేశారని... కానీ, కోర్టుకు రాకుండా పారిపోయారని ఎద్దేవా చేశారు. ఎన్టీఆర్ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను దేశం ఆదర్శంగా తీసుకుందని చెప్పారు. 

రాష్ట్ర స్థితిని, గతిని మార్చిన గొప్ప నాయకుడు చంద్రబాబు అని బుచ్చయ్య చౌదరి కొనియాడారు. నారా లోకేశ్ గురించి మాట్లాడుతూ... పులి కడుపున పులే పుడుతుందని అన్నారు. పెద్ద పులి సాధువు అయితే... చిన్న పులి ఉగ్రనరసింహమని వ్యాఖ్యానించారు. ఉగ్రనరసింహుడి దెబ్బకు గొడ్డలి పార్టీ పారిపోయిందని ఎద్దేవా చేశారు. దేశానికే లోకేశ్ దిక్సూచిగా మారే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు. రాష్ట్రాభివృద్ధి కోసం లోకేశ్ తీవ్రంగా శ్రమిస్తున్నారని కితాబునిచ్చారు. కాంగ్రెస్ ను మట్టికరిపించారనే అక్కసుతో ఎన్టీఆర్ కు భారతరత్న, దాదా సాహెబ్ ఫాల్కే అవార్డులు ఇవ్వలేదని విమర్శించారు. కేంద్రంపై ఒత్తిడి తెచ్చి ఎన్టీఆర్ కు భారతరత్న వచ్చేలా కృషి చేద్దామని అన్నారు.

Gorantla Butchaiah Chowdary
NTR
Chandrababu Naidu
Nara Lokesh
Mahanadu
Telugu Desam Party
YS Rajasekhara Reddy
Telugu Ganga Project
Andhra Pradesh Politics

More Telugu News